సమ్మక్క-సారలమ్మల నామస్మరణతో పులకించిన మేడారం
అశేష భక్తజనానికి వనదేవతల ఆశీస్సులు
అధికార లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం
చిలకలగుట్ట నుంచి మేడారం వరకు మూడంచెల భద్రత
గద్దెలపై కొలువుదీరిన వనదేవతలు
అపురూపఘట్టం ఆవిష్కృతం
ముద్ర, తెలంగాణ బ్యూరో :
మేడారంలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. సాహో సమ్మక్క.. సాహో సారలమ్మ.. అనే భక్తిపారవశ్యం.. ఆ గిరిజన వన దేవతల నామస్మరణ.. జయజయధ్వనులతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. కాకతీయ సేనలపై అసమాన్య పోరాటపటిమను ప్రదర్శించి.. అడవి బిడ్డల గుండెల్లో వీరనారీమణిగా నిలిచిన సమ్మక్క రాక కోసం యావత్ భక్తకోటి ఎదురుచూడగా.. వన దేవత గుట్ట దిగగానే జనం జేజేలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. కోయదొరల డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాలు.. శివసత్తుల పూనకాల మధ్య సమ్మక్క అడవిని వీడి జనం మధ్యకు వచ్చి గద్దెలపైకి చేరింది. కొలిచిన వారికి కొంగుబంగారమై కోర్కెలు తీర్చే తల్లుల దర్శనానికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తజనం తండోపతండాలుగా కదిలివచ్చింది. మహాజాతరలో తొలిఘట్టమైన వనదేవతలు గద్దెలపైకి చేరే ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు తరలివచ్చిన భక్తకోటితో కీకారణ్యం జనారణ్యమైంది. తొలిరోజు వనదేవతలిద్దరూ గద్దెలపైకి రావడం ఆద్యంతం సందడిగా సాగింది. మహాజాతరలో మొదటిరోజు బుధవారం సారలమ్మ ఆగమనం జరగగా.. పగిడిద్దరాజు, గోవిందరాజులనూ గద్దెలపై కొలువుదీరారు. రెండో రోజైన గురువారం ఆదివాసీల ఇలవేల్పు సమ్మక్క చిలకలగుట్ట నుంచి గద్దెపైకి వచ్చింది. దీనితో మహాజాతరలో కీలక ఘట్టం అవిష్కృతమైంది. సమ్మక్క ఆగమనంతో జాతరకు పూనకం పుట్టింది. గురువారం సాయంత్రం సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి సంప్రదాయ నృత్యాలు,అధికార లాంఛనాలతో ఊరేగింపుగా, మరోవైపు భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలాచరిస్తూ ఎత్తుబంగారాలు,ఒడిబియ్యం సమర్పించారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క.. అధికార లాంఛనాలతో సమ్మక్కకు స్వాగతం పలకగా జిల్లా ఎస్పీ గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు. సమ్మక్క పూజారులకు ఎదురువెళ్లిన జిల్లా కలెక్టర్ దివాకర వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వాగతం పలికారు. తెలుగు రాష్ట్రాలు సహా,చత్తీస్ గఢ్ ,మహారాష్ట్ర, జార్ఖండ్ ఇతర రాష్ట్రాల నుంచి అశేష జనం తరలిరాగా.. వనదేవతల భక్తులతో మేడారం పోటెత్తింది. కోట్లాది భక్తుల ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మకు జనం పసుపు, కుంకుమ,ఎత్తు బంగారాలు సమర్పిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా అత్యంత కోలాహలంగా మారింది. గురువారం భక్తుల సంఖ్య కోటి దాటిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు గద్దెలపైకి వనదేవతలు..!
వనదేవతలు సమ్మక్క, సారలమ్మలతో పాటు పగిడిద్దరాజు గోవిందరాజు మూడోరోజు శుక్రవారం గద్దెలపై భక్తులందరికీ దర్శనం ఇవ్వనున్నారు. గద్దెలపైన కొలువైన వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పోటీపడతారు. తల్లులంతా ఒకే వేదికపై కనిపించడంతో భక్తుల ఆనందానికి అవధులు హద్దలు దాటనున్నాయి. కాగా రెండ్రొజులు భక్తుల పూజలందుకున్న తర్వాత వనదేవతలిద్దరూ రేపు తిరిగి అడవిలోకి వెళ్లిపోనున్నారు.
మేడారం.. జిగేల్ !
జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, వారిని కనువిందు చేసేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు, చర్యలు తీసుకున్నది. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ కాంతులతో మేడారం అంతా జిగేల్‌మంటోంది. ఎక్కడా ఎల్‌ఈడీ స్క్రీన్స్, ఎగ్జిబిషన్స్, రంగుల రాట్నాలు దర్శనమిస్తున్నాయి. ఏర్పాటు చేసిన భారీ డిజిటల్ స్క్రీన్‌లపై అధికారులు సమ్మక్క సారలమ్మ జీవిత చరిత్రను ప్రదర్శిస్తున్నారు. భక్తులందరూ ఈ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతరకు అశేష జనం హాజరయ్యే అవకాశాలున్న నేఫథ్యంలో 6వేల బస్పులు నడుపుతున్నామన్నారు.
మహాజాతరకు ప్రముఖులు
కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర గిరిజన శాఖ మంత్రి జువల్ ఓరం గురువారం మేడారం సమ్మక్క–సారలమ్మను దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ దివాకర డోలు–డప్పులతో ఘన స్వాగతం పలికారు. ఆలయ ప్రాంగణంలో పూజారులు, అధికారులు కేంద్ర మంత్రులకు దర్శనం చేయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులిద్దరూ అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) ఇచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, 75 కేజీల, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం తులాభారం 86 కేజీల బంగారాన్ని అమ్మవారికి సమర్పించుకున్నారు.
డిప్యూటీ సీఎం, టీపీసీసీ దంపతులు…
మేడారం మహా జాతరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దంపతులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలు ఆదివాసీ సాంప్రదాయ కళాకారుల నృత్య ప్రదర్శనకు స్వాగతం పలికి సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారంతో అమ్మవార్లకు మొక్కులు సమర్పించి అనంతరం సమ్మక్క సారలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే
భీమదేవరపల్లి మండలం ములకనూరు గ్రామంలో జరుగుతున్న సమ్మక్క–సారలమ్మ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ములకనూరు సమ్మక్క–సారలమ్మ జాతరను స్థానిక నాయకులు, భక్తులు ఐక్యంగా ఘనంగా నిర్వహించారు. జాతర సమయంలో అమ్మవార్లు గద్దెలపైకి వచ్చే వేళ ఫైరింగ్ సంప్రదాయం గతంలో కొనసాగుతుందని చెప్పారు. స్థానిక నాయకుల ప్రతిపాదన మేరకు డీజీపీ, సీపీతో చర్చించి ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పునరుద్ధరించింది. శుక్రవారం సాయంత్రం అమ్మవార్లకు స్వాగతం పలికారు.



